FDI: పెట్టుబడుల స్వర్గధామం భారత్!.. 20 ఏళ్లలో 20 రెట్లు పెరిగిన ఎఫ్‌డీఐలు!
- 2021-22లో 83.57 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు
- అత్యధిక ఎఫ్‌డీఐలు వచ్చిన ఏడాదిగా 2021-22
- 20 ఏళ్లుగా క్రమంగా ఎఫ్‌డీఐలు పెరుగుతున్నాయి
- ప్రకటన విడుదల చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ
భారత దేశం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోతున్న వైనం విస్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది భారత్‌కు గతంలో ఎన్నడూ రానంత మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 83.57 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. రికార్డుల పరంగా చూస్తే... ఒకే ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో భారత్‌కు ఎఫ్‌డీఐలు రావడం ఇదే అత్యధికం. ఈ మేరకు శుక్రవారం భారత వాణిజ్య పరిశ్రమల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న అంతర్జాతీయ సంస్థల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే వస్తోంది. ఈ కారణంగానే ఏటికేడు భారత్‌కు వస్తున్న ఎఫ్‌డీఐల మొత్తం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ తరహా వృద్ధి గడచిన 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. గడచిన 20 ఏళ్లలో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐల శాతం 20 రెట్లు పెరిగిందని ఆ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.