Sri Lanka: ఆహార కొరతతో కొన్నిరోజులకు చచ్చిపోతామేమో!: శ్రీలంక ప్రజల ఆవేదన

Sri Lanka faces severe food shortage

  • శ్రీలంకలో దుర్భర పరిస్థితులు
  • ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం
  • మండిపోతున్న ధరలు
  • వ్యవసాయ రంగంపై దృష్టిసారించిన ప్రభుత్వం

శ్రీలంకలో పరిస్థితులు క్షీణదశకు చేరుకున్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా టూరిజం రంగంపై ఆధారపడి మనుగడ సాగించే శ్రీలంకకు కరోనా సంక్షోభం పెనువిపత్తులా పరిణమించింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ లతో శ్రీలంక పర్యాటక రంగం కుదేలు కాగా, విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమేపీ కరిగిపోయాయి. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుతుండగా, చమురు, ఔషధాలు, ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడింది. 

నిత్యావసరాలు దొరక్క సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలైన గ్యాస్, కిరోసన్ కూడా దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడంలేదని, పరిస్థితి ఇలాగే కనసాగితే కొన్నాళ్లకు చచ్చిపోతామేమో అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

శ్రీలంకలో ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 28 శాతానికి పెరగ్గా, రానున్న రెండు నెలల్లో అది 40 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. దేశంలో ఆహార పదార్థాల ధరలు 46 శాతం పెరగడంతో, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు కనిపిస్తే చాలు... వారిపై దాడులకు కూడా వెనుకాడని పరిస్థితి నెలకొంది. 

కాగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే దేశంలో ఆహార కొరత అత్యంత తీవ్రంగా ఉందని వెల్లడించారు. అయితే, ఎటువంటి క్లిష్టపరిస్థితులు వచ్చినా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ప్రోత్సాహం అందిస్తామని, రైతులకు ఎరువుల కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయితే, యాలా (మే-ఆగస్టు సీజన్) నాటికి ఎరువులు సమకూర్చుకోలేమని, మహా (సెప్టెంబరు-మార్చి) సీజన్ నాటికి ఎరువులు అందజేతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని విక్రమసింఘే వెల్లడించారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స 9 మందితో నేడు నూతన క్యాబినెట్ ప్రకటించారు. కీలకశాఖలైన ఆరోగ్యం, వాణిజ్య మంత్రులతో పాటు టూరిజం మంత్రి కూడా ఉన్నారు. అయితే, అత్యంత ముఖ్యమైన ఆర్థికశాఖ మాత్రం ప్రధాని విక్రమసింఘేనే పర్యవేక్షిస్తున్నారు. 

అటు, జీ7 దేశాలు అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీలంకకు చేయూతగా నిలిచేందుకు సమాయత్తం అవుతున్నాయి. జీ7 దేశాల ఆర్థిక మంత్రులు జర్మనీలో సమావేశమై శ్రీలంకను గట్టెక్కించేందుకు అందించే సహాయ సహకారాలకు మద్దతు ప్రకటించారు.

Sri Lanka
Food
Shortage
Crisis
Island Nation
  • Loading...

More Telugu News