Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలకు మళ్లీ మంచి రోజులు.. ‘కొంటె మహిళలు’ మాత్రం ఇంటికే పరిమితమన్న తాలిబన్ మంత్రి

We keep naughty women at home say Taliban

  • హైస్కూలు చదువులకు అవకాశం ఇస్తామన్న మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ
  • తమకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళలు మాత్రం ఇంటికే పరిమితమని హెచ్చరిక
  • హిజాబ్‌ ధరించాలని బలవంతం చేయడం లేదంటూనే అది ప్రతి ఒక్కరు పాటించాలన్న హక్కానీ
  • యూఎస్ ఎఫ్‌బీఐ జాబితాలో ప్రపంచ ఉగ్రవాదిగా హక్కానీ
  • తలపై 10 మిలియన్ డాలర్ల నజరానా

చూస్తుంటే ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలకు మళ్లీ మంచి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. మహిళలకు త్వరలోనే ‘గుడ్‌న్యూస్’ చెబుతామని ఆ దేశ అంతర్గత శాఖ తాత్కాలిక మంత్రి, తాలిబన్ కో-డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హక్కానీ పేర్కొన్నారు. హైస్కూలు చదువులకు అమ్మాయిలను మళ్లీ అనుమతిస్తామని ఆయన చెప్పారు. గతంలోనే వారు ఈ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇప్పుడు తాజా ప్రకటనతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తమకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళలు మాత్రం ఇంటికే పరిమితం అవుతారని చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న మొదట్లో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని ప్రకటించిన తాలిబన్లు ఆ తర్వాత వారిపై ఉక్కుపాదం మోపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వారి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎట్టకేలకు మళ్లీ ఇన్నాళ్లకు తమ నిర్ణయాన్ని మార్చుకున్న తాలిబన్లు అమ్మాయిలు చదువుకునేందుకు అవకాశం ఇస్తామని చెప్పడం శుభపరిణామంగానే భావిస్తున్నారు. 

తాలిబన్ పాలనలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కొంటె మహిళలలు (నాటీ విమెన్) మాత్రం ఇంటికే పరిమితమవుతారని చెప్పారు. కొందరి వ్యక్తుల నియంత్రణలో ఉంటూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిని ఉద్దేశించి ఇలా ‘కొంటె మహిళలు’ అని జోక్ చేసినట్టు ఆయన వివరించారు.

ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్టులో ఉన్న సిరాజుద్దీన్ హక్కానీ తలపై 10 మిలియన్ డాలర్ల నజరానా ఉంది. అమెరికా ఆయనను ‘ప్రపంచ ఉగ్రవాది’గా ప్రకటించింది. కాగా, హక్కానీ మాట్లాడుతూ.. బాలికలు ఇప్పటికే ఆరో తరగతి వరకు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి ఉందని అన్నారు. ఆపైన కూడా చదువు కొనసాగించే విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని ఆయన చెప్పుకొచ్చారు. 

ప్రతి మహిళ హిజాబ్‌ను తప్పకుండా ధరించాలన్న ఇటీవలి ఆదేశాలపై ఆయన మాట్లాడుతూ.. అలా ధరించమని తామేమీ బలవంతం చేయడం లేదని, సలహా మాత్రమే ఇస్తున్నామని అన్నారు. హిజాబ్ తప్పనిసరి కాకున్నా ప్రతి ఒక్కరు అమలు చేయాల్సిన ఇస్లామిక్ ఆదేశం ఇదని పేర్కొన్నారు.

More Telugu News