Jai Bhim: తమిళ స్టార్ హీరో సూర్యపై కేసు నమోదు
- జై భీమ్‌లో వన్నియార్ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు
- పిటిషన్ వేసిన రుద్ర వన్నియార్ సేన వ్యవస్థాపకుడు సంతోష్
- నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌లపై కూడా కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
తమిళ స్టార్ హీరో, ఆస్కార్ గడప దాకా వెళ్లి వచ్చిన జై భీమ్ సినిమాలో ప్రధాన భూమిక పోషించిన నటుడు సూర్యపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో నేరుగా ఓటీటీలోనే విడుదలైనా కూడా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను ఏ మేర సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమాను సూర్య భార్య జ్యోతిక నిర్మించగా.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. గిరిజనులపై అగ్రకులాల ఆధిపత్యం, అందుకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేకించి పోలీసు విభాగం ఎలా వత్తాసు పలుకుతాయన్న విషయాన్ని చెబుతూనే... అణగారిన వర్గాలకు మద్దతుగా న్యాయపోరాటం సాగించి విజయం సాధించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రు వృత్తి జీవితం కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు.
అయితే ఈ చిత్రంలో వన్నియార్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించిన రుద్ర వన్నియార్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా సూర్యపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు అంగీకరించలేదు.
దీంతో నేరుగా కోర్టును ఆశ్రయించిన సంతోష్... సూర్యతో పాటు జ్యోతిక, జ్ఞానవేల్‌లపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ అయినా... ఆ ముగ్గురు విచారణకు హాజరు కాలేదు. దీంతో సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్‌లపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా పోలీసులు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్‌లపై కేసు నమోదు చేశారు.