Kamal Haasan: నా మాతృభాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటాను: కమల్
![kamal on hindi language](https://imgd.ap7am.com/thumbnail/cr-20220517tn6283590063d37.jpg)
- హిందీ భాష గురించి కమలహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తాను హిందీకి వ్యతిరేకిని కాదని వ్యాఖ్య
- తన మాతృ భాష తమిళం అని వివరణ
- ఆ భాష వర్థిల్లాలని చెప్పడం తన బాధ్యతన్న హీరో
దేశంలో హిందీ భాషను రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ భాష గురించి ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కొత్త సినిమా విక్రమ్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమం చెన్నైలో నిర్వహించగా అందులో పాల్గొన్న కమల్ మాట్లాడుతూ... తన మాతృ భాషకు ఎవరు అడ్డువచ్చినా ఎదుర్కొంటానని, దీనికి రాజకీయాలతో సంబంధం ఏమీ లేదని చెప్పారు.
తాను హిందీకి వ్యతిరేకిని కాదని అన్నారు. తన మాతృ భాష తమిళం అని, ఆ భాష వర్థిల్లాలని చెప్పడం తన బాధ్యత అని తెలిపారు. మాతృ భాషను ఎవరూ మరవకూడదని ఆయన చెప్పారు. కాగా, సినిమా, రాజకీయం కవలపిల్లలని, తాను ఈ రెండింట్లోనూ ఉన్నానని గుర్తు చేశారు. గుజరాతీ, చైనీస్ భాషలు కూడా నేర్చుకుని, మాట్లాడవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.