Nano Robots: దంత వైద్యంలో బుల్లి రోబోలు... బ్యాక్టీరియా అంతు చూస్తాయట!

Nano Robots in dental treatment

  • కొత్త పుంతలు తొక్కనున్న రూట్ కెనాల్ ట్రీట్ మెంట్
  • దంత వైద్యంలోకి నానా టెక్నాలజీ
  • ఇనుము, సిలికాన్ డయాక్సైడ్ తో రోబోల తయారీ
  • సూక్ష్మరంధ్రాల్లోకి సైతం వెళ్లగలిగే రోబోలు

నానో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో దంత వైద్యంలోనూ ఇది ఎంతో ఉపయోగకారిగా నిలవనుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) పరిశోధకులు తాజాగా బుల్లి నానో రోబోలకు రూపకల్పన చేశారు. వీటిని దంతాల మధ్యలోకి పంపి అక్కడ తిష్టవేసిన మొండి బ్యాక్టీరియాలను నిర్మూలించనున్నారు. 

పాక్షికంగా పాడైన దంతాల పునరుద్ధరణలో కీలకమైన రూట్ కెనాల్ చికిత్సలో ఈ బుల్లి నానో రోబోలు కీలకపాత్ర పోషిస్తాయని ఐఐఎస్ సీ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ లో... పంటిలో పాడైపోయి గుజ్జుగా మారిన పదార్థాన్ని రసాయనాలు లేక యాంటీబయాటిక్స్ తో బయటికి నెట్టివేస్తారు. తద్వారా ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. 

ఈ పద్ధతిలో పంటిలో ఉండే సూక్ష్మ రంధ్రాల్లో ఉన్న బ్యాక్టీరియాను కొన్ని సందర్భాల్లో తొలగించలేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో తాము అభివృద్ధి చేసిన సూక్ష్మ రోబోలు అతి చిన్న రంధ్రాల్లో దాగి ఉన్న బ్యాక్టీరియాపైనా సమర్థంగా పనిచేస్తాయని ఐఐఎస్ సీ పరిశోధకుడు షన్ముఖ్ శ్రీనివాస్  తెలిపారు. 

ఈ నానో రోబోలు ఇనుముతో తయారైనవి. వీటి ఉపరితలంలో సిలికాన్ డయాక్సైడ్ పొర ఉంటుంది. స్వల్ప తీవ్రత కలిగిన అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేసే ఓ పరికరంతో ఈ రోబోలను నియంత్రించవచ్చు. పంటి మధ్యన ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి వాటిని ఎలా కావాలంటే అలా కదిలించవచ్చు. ఈ మైక్రో రోబోలను ఐఐఎస్ సీ... థెరానాటిలస్ అనే స్టార్టప్ తో కలిసి అభివృద్ధి చేసింది. 

నిర్దేశిత పంటిలోకి వీటిని పంపించిన తర్వాత ఓ మైక్రో స్కోప్ ద్వారా వీటి పనితీరును గమనించవచ్చు. ఈ రోబోలు అతి సూక్ష్మమైనవి అయినప్పటికీ, చికిత్స పూర్తయిన తర్వాత అయస్కాంత శక్తి ద్వారా వాటిని వెనక్కి తీసుకురావచ్చు.

Nano Robots
Dental Treatment
Root Canal
IISC
Bengaluru
  • Loading...

More Telugu News