Andhra Pradesh: కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసింది... ఇప్పుడే చెప్పకూడదంటూనే చెప్పేసిన మంత్రి సురేశ్
- ఆగస్టు 15 తర్వాత రాష్ట్రంలో ఊహించని పరిణామాలుంటాయన్న మంత్రి
- అమరావతిలో గత ప్రభుత్వం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఆరోపణ
- వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్న సురేశ్
ఏపీలో మూడు రాజధానుల విషయంపై రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసిందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పకూడదంటూనే... కర్నూలుకు జ్యుడిషియల్ కేపిటల్ వచ్చేసిందని అన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పుడే ప్రకటించకూడదని కూడా సురేశ్ చెప్పడం గమనార్హం.
ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయని చెప్పిన మంత్రి సురేశ్.. ఏం జరగబోతోందో మీరే చూస్తారని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అమరావతి చుట్టూ అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్ చూపిస్తూ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఓ సామాజిక వర్గానికి మాత్రమే అభివృద్ధి జరిగేలా చేశారని ఆయన పేర్కొన్నారు. అందుకే వికేంద్రీకరణ మంత్రంతో అభివృద్దితో పాటు పాలన కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని మంత్రి చెప్పారు.