Jagan: ఈరోజు రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ. 5,500 చొప్పున జమ చేస్తున్నాం: సీఎం జగన్

Jagan transfers Raithu Bharosa funds to farmers
  • వైఎస్సార్ రైతు భరోసా నిధులను జమ చేసిన జగన్
  • ఇప్పటి వరకు రూ. 23,875 కోట్లను ఇచ్చామని వెల్లడి
  • గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాను గుర్తించాలని వ్యాఖ్య
ఖరీఫ్ పనులు పూర్తి కాకముందే వైఎస్సార్ రైతు భరోసా డబ్బులను అందిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులను ఇస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతిఏటా రూ. 13,500 చొప్పున రైతులకు తమ ప్రభుత్వం అందిస్తోందని... మేలో 7,500... అక్టోబర్ లో రూ. 4 వేలు, జనవరిలో రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని... ఈరోజు నేరుగా రైతన్నల ఖాతాలోకి రూ. 5,500 జమ చేస్తున్నామని తెలిపారు.

 ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ. 23,875 కోట్లను జమ చేశామని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా రైతులకు లక్షా 10 వేల కోట్లను ఇచ్చామని అన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

గత మూడేళ్లుగా రాష్ట్రంలో కరవు లేదని జగన్ అన్నారు. రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బయల్దేరారని... పరిహారం అందని ఒక్క రైతును కూడా ఆయన చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు అమితమైన ప్రేమను చూపించారని అన్నారు. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి కోరారు. రైతులకు ఇంతగా సహాయపడిన ప్రభుత్వ పథకాన్ని గతంలో ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. ప్రతి అడుగులో రైతులకు అండగా ఉన్నామని సీఎం చెప్పారు.
Jagan
Raithu Bharosa
YSRCP

More Telugu News