Lucknow Super Giants: లక్నోను ఓడించి రెండో స్థానంలోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

All round RR keep LSG waiting for playoff berth
  • ప్లే ఆఫ్స్ కోసం లక్నోకు తప్పని ఎదురుచూపులు
  • సమష్టిగా రాణించి విజయాన్ని అందుకున్న రాజస్థాన్
  • ట్రెంట్ బౌల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఓడిన లక్నో రెండు నుంచి మూడో స్థానానికి దిగజారింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. 29 పరుగులకే క్వింటన్ డికాక్ (7), ఆయుష్ బడోని (0), కెప్టెన్ కేఎల్ రాహుల్ (10) వికెట్లను కోల్పోయింది. దీపక్ హుడా, కృనాల్ పాండ్యా జోడీ రాజస్థాన్ బౌలర్లను కాసేపు ఎదురొడ్డి పరుగులు రాబట్టింది.

అయితే, షరా మామూలుగానే కృనాల్ మరోమారు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. 25 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న దీపక్ హుడా కూడా ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేసిన హుడా.. చాహల్ బౌలింగులో సంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ (1) చమీర (0) ఒక్క బంతి తేడాతో పెవిలియన్ చేరారు. 151 పరుగుల వద్ద మార్కస్ స్టోయినిస్ (27) ఇన్నింగ్స్ కూడా ముగియడంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది. మొత్తంగా 20 ఓవర్లలో 154 పరుగులు చేసిన లక్నో విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (2) మినహా బ్యాటర్లందరూ రాణించారు. జైస్వాల్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా కెప్టెన్ శాంసన్ 32, పడిక్కల్ 39, రియాన్ పరాగ్ 19, నీషమ్ 14, అశ్విన్ 10, బౌల్ట్ 17 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తోను, బంతితోను రాణించిన ట్రెంట్ బౌల్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ కేపిటల్స్ తలపడతాయి.
Lucknow Super Giants
Rajasthan Royals
Trent Boult
IPL 2022

More Telugu News