Telangana: 2072 దాకా హైదరాబాద్ తాగునీటికి ఇబ్బందే ఉండదు: మంత్రి కేటీఆర్

KTR Laid Foundation Stone For Sunkisala Intake Well For Hyderabad Drinking Water

  • ఏడేళ్లు కరవు వచ్చినా సమస్య రాదని వ్యాఖ్య
  • నాగార్జున సాగర్ వద్ద రూ.1,453 కోట్లతో ఇన్ టేక్ వెల్ కు శంకుస్థాపన
  • వచ్చే ఏడాది ఎండాకాలం నాటికి పూర్తి చేస్తామని వెల్లడి 

హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా చేయడం కోసం ఆ వ్యవస్థను సమూలంగా ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నాగార్జునసాగర్ కు సమీపంలోని సుంకిశాల వద్ద రూ.1,453 కోట్లతో హైదరాబాద్ మెట్రోవాటర్ అండ్ సివరేజ్ సర్వీసెస్ బోర్డు ఆధ్వర్యంలో ఇన్ టేక్ వెల్ ను నిర్మిస్తున్నారు. 

ఇవాళ దానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, జల మండలి అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 

2072 వరకు హైదరాబాద్ కు తాగు నీటికి ఇబ్బందులుండవని చెప్పారు. వరుసగా ఏడేళ్ల పాటు కరవు వచ్చినా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ 100 కిలోమీటర్ల మేర విస్తరించినా తాగునీటి సమస్యలు రావన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతాలకూ నీటిని సరఫరా చేస్తామన్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్ కు తాగునీటి అవసరాలు 37 టీఎంసీలుగా ఉందని, మరో 34 టీఎంసీలు కావాల్సి వస్తుందని చెప్పారు. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67, 2072 నాటికి 70.97 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయన్నారు. సుంకిశాల ఇన్ టేక్ వెల్ తో రోజూ 16 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఎండాకాలం నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News