Kamareddy District: కామారెడ్డి తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసు నిందితులకు బెయిల్
- కామారెడ్డిలో తల్లీ కొడుకుల ఆత్మహత్య
- మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాధితులు
- ఏడుగురిపై కేసు నమోదు
- లొంగిపోయిన ఆరుగురికి బెయిల్ మంజూరు
తెలంగాణలో కలకలం రేపిన కామారెడ్డి తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురికి బెయిల్ మంజూరైంది. కొందరు వ్యక్తుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్, అతడి తల్లి పద్మ కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. 18 నెలలుగా ఏడుగురు వ్యక్తులు తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పిన సంతోష్.. వారి పేర్లను కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు బాధితుడు వెల్లడించిన పేర్ల ఆధారంగా మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేస్తుండగానే.. నిందితుల్లో ఆరుగురు లొంగిపోగా...మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆరుగురు కామారెడ్డి కోర్టును ఆశ్రయించగా.. ప్రతి శుక్రవారం కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలన్న నిబంధనతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.