Richa Chadha: బాలీవుడ్ సినిమాలు వెనుకబడటానికి కారణం ఇదే: రిచా చద్దా
- హిందీ సినిమాల టికెట్ రేట్లు ఎక్కువన్న రిచా
- అంత ఖర్చు పెట్టి చూసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదని వ్యాఖ్య
- డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల కూడా బాలీవుడ్ నష్టపోతోందన్న రించా
బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ సినిమాలు బోల్తా కొడుతున్నాయి. రూ. 100 కోట్లు వసూలు చేయడం కూడా వాటికి కష్టమవుతోంది. మరోవైపు ఇదే సమయంలో దక్షిణాది సినిమాలు దుమ్మురేపుతున్నాయి. దక్షిణాది సినిమాల దెబ్బకు బాలీవుడ్ సినిమాలు అల్లాడుతున్నాయి. సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ సినిమాలు నిలబడలేకపోతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ అంశంపై బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దక్షిణాది సినిమాలకు టికెట్ రేట్లు 100 నుంచి 400 రూపాయల లోపు మాత్రమే ఉంటాయని... కానీ హిందీ సినిమాలకు రూ. 500 పైనే ఉంటుందని... సమస్య అంతా ఇక్కడే ఉందని చెప్పింది. సినిమా బాగున్నా, బాగోలేకపోయినా రూ. 500 ఖర్చు పెట్టి సినిమా చూసేందుకు అభిమానులు ఇష్టపడటం లేదని... అందుకే కలెక్షన్లు దారుణంగా ఉంటున్నాయని అన్నారు. రూ. 500తో ఇంటికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లొచ్చనే మధ్య తరగతి ప్రజలే మన దేశంలో ఎక్కువగా ఉంటారని చెప్పింది. డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల కూడా బాలీవుడ్ ఎక్కువగా నష్టపోతోందని... వీళ్లు మారాల్సిన అవసరం ఉందని తెలిపింది.
దక్షిణాది సినిమాల టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల ఆ మాత్రం డబ్బు ఖర్చు చేయడానికి అభిమానులు వెనుకాడరని చెప్పింది. ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కలెక్షన్లు బాగా వస్తాయని తెలిపింది.