Jagan: ఎన్నికలు దగ్గర పడే సమయానికి చంద్రబాబు అప్పట్లో లబ్ధిదారుల సంఖ్యను పెంచారు: జగన్
- పాదయాత్రలో మత్స్యకారుల సమస్యల గురించి తెలుసుకున్నానన్న జగన్
- చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని వ్యాఖ్య
- పాలన తేడాలు గమనించాలని జగన్ విజ్ఞప్తి
- నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభం
ఏపీ సీఎం వైఎస్ జగన్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్లలో నాలుగో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, అనంతరం మురమళ్ల వేదికపై ప్రసంగించారు. భగవంతుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, దాదాపు 1,09,000 మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు మొత్తం కలిపి 418 కోట్ల రూపాయల సాయం చేశామని వివరించారు.
ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మత్స్యకారుల సమస్యల గురించి తెలుసుకున్నానని జగన్ చెప్పారు. గత సీఎం చంద్రబాబు నాయుడి పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని, అప్పటి పాలనకు, తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాలు గమనించాలని జగన్ కోరారు. అప్పట్లో కొంతమందికి మాత్రమే పరిహారం అందేదని, ఇప్పుడు లబ్ధిదారులందరికీ అందుతోందని చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో మొదట 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారని, ఎన్నికలు దగ్గర పడే సమయానికి మాత్రం 50 వేల మందికి పరిహారం ఇచ్చారని జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు మాత్రమేనని అన్నారు.
కాగా, అంతకుముందు మత్స్య శాఖమంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవితాల్లో వైఎస్ జగన్ వెలుగులు నింపుతున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు భరోసా అందిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో రూ.5 వేలు, ఒడిశాలో రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని, తీర ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అధికంగా పరిహారం అందిస్తున్నామని ఆయన తెలిపారు.