Andhra Pradesh: ఏపీలో సీఎం, వీఐపీ కాన్వాయ్ ఖర్చుల బకాయి రూ.17.5 కోట్లు.. తక్షణమే చెల్లించాలంటూ రవాణా శాఖ లేఖ
- మూడేళ్లుగా కాన్వాయ్ ఖర్చులను విడుదల చేయని ప్రభుత్వం
- బకాయిల కోసం ప్రభుత్వానికి రవాణా శాఖ లేఖ
- తక్షణమే బకాయిలు చెల్లించాలని అభ్యర్థన
- బకాయిలు చెల్లించకుంటే కాన్వాయ్‌లను ఏర్పాటు చేయలేమని వెల్లడి
గడచిన మూడేళ్లలో ఏపీలో ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కోసం ఏర్పాటు చేస్తున్న కాన్వాయ్‌ల ఖర్చులు రూ.17.5 కోట్లకు చేరుకున్నాయి. సీఎం సహా వీఐపీల కోసం కాన్వాయ్‌లను ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర రవాణా శాఖది కాగా... ఆ శాఖకు ఖర్చులను ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా ఈ ఖర్చులను రవాణా శాఖకు ఏపీ ప్రభుత్వం చెల్లించనే లేదట.
ఫలితంగా ఈ మూడేళ్లలో ఈ బకాయిలు రూ.17.5 కోట్లకు చేరాయి. వీటి కోసం తాజాగా ఏపీ రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆ లేఖలో కోరింది. అంతేకాకుండా తక్షణమే బకాయిలు చెల్లించకుంటే... సీఎం సహా వీఐపీలకు ఇకపై కాన్వాయ్‌లను ఏర్పాటు చేయలేమంటూ రవాణా శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.