Harpreet Singh Bhatia: ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న చత్తీస్ గఢ్ రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్
- ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వైనం
- చిక్కుల్లోపడిన హర్ ప్రీత్ సింగ్ భాటియా
- 2014లో ఆడిటర్/అకౌంటెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు
చత్తీస్ గఢ్ రంజీ క్రికెట్ జట్టు సారథి హర్ ప్రీత్ సింగ్ భాటియా చిక్కుల్లో పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించాడంటూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. హర్ ప్రీత్ సింగ్ భాటియా 2014లో ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ సమర్పించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనిపై రాయ్ పూర్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ స్పందిస్తూ, చత్తీస్ గఢ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం (ఆడిట్ విభాగం) నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు.
రంజీ జట్టు సారథి హర్ ప్రీత్ సింగ్ భాటియాపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), సెక్షన్ 467 (ఫోర్జరీ) కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
31 ఏళ్ల హర్ ప్రీత్ భాటియా ప్రస్తుతం బలోద్ జిల్లాలో నివసిస్తున్నాడని తెలిపారు. భారత ఆడిట్స్ మరియు అకౌంట్స్ డిపార్ట్ మెంట్ కార్యాలయంలో ఆడిటర్/అకౌంటెంట్ ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికెట్ (బోగస్ మార్కుల జాబితా) సమర్పించాడని ఎస్పీ వివరించారు. ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ యూనివర్సిటీ నుంచి బీకాం డిగ్రీ పుచ్చుకున్నట్టుగా హర్ ప్రీత్ భాటియా సర్టిఫికెట్లు సమర్పించాడని వివరించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు.