Rajasthan Royals: మార్ష్ ఆల్‌రౌండ్ షో.. రాజస్థాన్‌పై ఢిల్లీ అలవోక విజయం

Marsh and Warner help DC hammer RR

  • ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకొచ్చిన ఢిల్లీ కేపిటల్స్
  • రెండు వికెట్లు తీసుకుని, 89 పరుగులు చేసి మార్ష్
  • నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్

మిచెల్ మార్ష్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన పోరులో ఢిల్లీ కేపిటల్స్ అలవోక విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 160 పరుగులు చేసింది. 

అనంతరం 161 పరుగుల ఓ మోస్తరు లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ మరో 11 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌గా వచ్చిన శ్రీకర్ భరత్ (0) జట్టు ఖాతా తెరవకముందే అవుటైనా డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్ క్రీజులో పాతుకుపోయి చెలరేగిపోయారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

ఇక డేవిడ్ వార్నర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా అర్ధ సెంచరీ (52) చేయగా, మిచెల్ మార్ష్ 89 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మార్ష్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (13 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఢిల్లీ 12 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకుంది. ఓడిన రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50)తో అలరించాడు. పడిక్కల్ 48 (30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, నార్జ్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. అటు బంతితోను, ఇటు బ్యాట్‌తోనూ మెరిసిన మార్ష్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు చెన్నై-ముంబై జట్లు తలపడతాయి.

  • Loading...

More Telugu News