IPL 2022: సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయా?
- అవకాశాలు దాదాపు కష్టమే
- వెళ్లాలంటే మిగిలిన మూడింటిలోనూ గెలవాల్సిందే
- ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు మిగిలిన మ్యాచుల్లో ఓడాలి
- నెట్ రన్ రేటులో ముందుకు పోవాలి
- అప్పుడే సీఎస్కేకు అవకాశాలు
ఆడిన 11 మ్యాచులకు గాను కేవలం నాలుగింటిలోనే విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ కు చేరుతుందా..? అంటే కష్టమే అన్న సమాధానం వస్తుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఈ టీమ్ 4 టైటిల్స్ ను గెలుచుకుంది. కానీ, ఆటతీరు మాత్రం గతంలో మాదిరిగా లేదు. రెండు కొత్త జట్ల రాకతో మారిన సీఎస్కే నిర్మాణం ఇంకా గాడిన పడలేదు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో సీఎస్కే కింది నుంచి రెండో స్థానంలో ఉంది.
ఇప్పటికి ముంబై ఇండియన్స్ ఒక్కటే ప్లే ఆఫ్స్ కు వెళ్లదని తేలింది. 11 మ్యాచులకు గాను ముంబై రెండే విజయాలతో చివరి స్థానంలో ఉంది. 9 ఓటములతో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించినట్టే. జడేజా కెప్టెన్ గా పనిచేసిన మొదటి 8 మ్యాచుల్లో సీఎస్కే ఆరింటిలో ఓటమి చవిచూడడం ఈ జట్టు అవకాశాలను దెబ్బతీసిందని చెప్పుకోవాలి. ధోనీ తన సారథ్యంలో మూడు మ్యాచులకు గాను రెండింటిలో గెలుపు సాధించాడు.
సీఎస్కే ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో గెలవాల్సిందే. మే 12న ముంబై ఇండియన్స్ తో, 15న గుజరాత్ టైటాన్స్ తో, 20న రాజస్థాన్ రాయల్స్ జట్టును సీఎస్కే ఎదుర్కోనుంది. సీఎస్కే ఒకవేళ మిగిలిన మూడింటిలోనూ గెలిస్తే అప్పుడు 7 విజయాలతో 14 పాయింట్లతో.. నాలుగో స్థానం కోసం మిగిలిన జట్లతో పోటీ పడాల్సి రావచ్చు. అది కూడా రాజస్థాన్ రాయల్స్ మిగిలిన మూడింటిలో ఓడిపోయి 7 పాయింట్ల దగ్గరే ఆగిపోయినా.. రాయల్ చాలెంజర్స్ మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడి ఏడు పాయింట్ల దగ్గరే నిలిచినా అప్పుడు నెట్ రన్ రేటు ప్రామాణికం అవుతుంది.
రాజస్థాన్, బెంగళూరు మిగిలిన మ్యాచుల్లో ఒక్కోటి గెలిచినా సీఎస్కేకు తలుపులు మూసేసినట్టు అవుతుంది. ఈ రెండూ ఏడు పాయింట్ల వద్దే ఉండి.. 5 విజయాలతో ఉన్న ఢిల్లీ, ఎస్ఆర్ హెచ్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ లో ఏ రెండు అయినా మిగిలిన మూడింటిలో గెలిస్తే 8 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు వెళతాయి.