Asani: రేపు సాయంత్రం నుంచి ఉత్తరాంధ్రపై 'అసని' ఎఫెక్ట్
- బంగాళాఖాతంలో తీవ్ర తుపాను
- విశాఖకు ఆగ్నేయంగా 500 కిమీ దూరంలో కేంద్రీకృతం
- గంటకు 25 కిమీ వేగంతో కదులుతున్న అసని
- ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను అసని పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంది. అసని గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఇది విశాఖపట్నంకు ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
అసని ప్రభావం ఏపీ ఉత్తరకోస్తాపై రేపటి (మే 10) నుంచి ఉండనుంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంద్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం అలజడి ఉంటుందని, గురువారం (మే 12) వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
కాగా, మే 10 నాటికి ఉత్తరాంధ్ర తీరాన్ని సమీపించనున్న అసని... ఆపై దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.