Anand Mahindra: "శభాష్ ఆనంద్ మహీంద్రా" అంటున్న నెటిజన్లు... ఎందుకంటే...!

Netizens praises Anand Mahindra

  • దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఇడ్లీ బామ్మ
  • రూపాయికే 4 ఇడ్లీలు అమ్ముతున్న వైనం
  • పేదల కడుపు నింపుతున్న వృద్ధురాలు
  • ఇల్లు కటిస్తానని గతంలో ప్రకటించిన ఆనంద్ మహీంద్రా
  • మదర్స్ డే నాడు ఇల్లు అప్పగింత

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎంతో దాతృత్వ గుణం ఉన్న వ్యక్తిగా పేరొందారు. తాజాగా ఆయన ఉదార స్వభావం మరోసారి వార్తల్లోకెక్కింది. తమిళనాడులో రూపాయికే 4 ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న కమలాత్తాళ్ కు ఆయన ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తానని 2019లో తానిచ్చిన మాటను ఆనంద్ మహీంద్రా నిలుపుకున్నారు. నేడు మాతృదినోత్సవం కాగా, నూతనంగా నిర్మించిన గృహాన్ని కమలాత్తాళ్ కు అందించారు. 

కమలాత్తాళ్ స్వస్థలం తమిళనాడులోని వడివెలంపాలయం గ్రామం. ఆమె గత 37 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా, పేదల కడుపు నింపడమే ధ్యేయంగా అత్యంత చవకగా ఇడ్లీలు అమ్ముతోంది. 2019లోనే ఈ ఇడ్లీ బామ్మ గురించి ఆనంద్ మహీంద్రా అందరికీ వెల్లడించారు. ఆమె కట్టెల పొయ్యిపై కష్టపడుతుండడంతో గ్యాస్ కొనిస్తానని మాటిచ్చారు. ఆపై ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడది చేసి చూపించారు.

తాజాగా ఇంటి నిర్మాణ పనులు, కమలాత్తాళ్ నూతన గృహప్రవేశ దృశ్యాలతో కూడిన వీడియోను ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. మదర్స్ డే నాడు ఆ ఇంటిని ఇడ్లీ అమ్మకు ఇచ్చేలా ఎంతో కష్టపడి సకాలంలో పని పూర్తిచేసిన తమ బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు. మాతృమూర్తికి ఉండాల్సిన లక్షణాలకు కమలాత్తాళ్ ప్రతిరూపమని కొనియాడారు. ఆమె పనికి అండగా నిలవడాన్ని గొప్పగా భావిస్తున్నామని తెలిపారు. 

దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పెద్ద మనసు చాటుకున్నారంటూ ఆనంద్ మహీంద్రాపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.

Anand Mahindra
Idly Amma
House
Tamilnadu
  • Loading...

More Telugu News