Dinesh Karhik: ఆఖరి ఓవర్లో చితకబాదిన దినేశ్ కార్తీక్... సన్ రైజర్స్ టార్గెట్ 193 రన్స్
- వాంఖెడే స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు
- 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 రన్స్ చేసిన బెంగళూరు
- 8 బంతుల్లో 30 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్
- 73 పరుగులతో నాటౌట్ గా నిలిచి డుప్లెసిస్
రాయల్ చాలెంజర్స్ తో బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది.
19 ఓవర్ పూర్తయ్యేసరికి బెంగళూరు స్కోరు 167 పరుగులు. అప్పటికి 4 బంతుల్లో 8 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్... ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించాడు. కొత్త కుర్రాడు ఫజల్ హక్ ఫరూఖీ వేసిన ఆ ఓవర్లో దినేశ్ కార్తీక్ వరుసగా 3 భారీ సిక్స్ లు, 1 ఫోర్ కొట్టాడు. మొత్తమ్మీద ఆ ఓవర్లో 25 పరుగులు రాగా, బెంగళూరు స్కోరు అమాంతం పెరిగిపోయింది. దినేశ్ కార్తీక్ కేవలం 8 బంతుల్లోనే 4 సిక్స్ లు, 1 ఫోర్ సాయంతో 30 పరుగులు చేయడం విశేషం.
మరో ఎండ్ లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ తో తొలిబంతికే విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, రజత్ పాటిదార్ తో కలిసి డుప్లెసిస్ సన్ రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రజత్ పాటిదార్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ సైతం బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు స్కోరు 150 మార్కు దాటింది. మ్యాక్స్ వెల్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 33 పరుగులు చేసి కార్తీక్ త్యాగి బౌలింగ్ లో అవుటయ్యాడు.
సన్ రైజర్స్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీక్ త్యాగి 1 వికెట్ తీశాడు. జమ్ము ఎక్స్ ప్రెస్ గా పేరుగాంచిన ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులిచ్చుకున్నాడు.