Apple: ఐఫోన్ 4ఎస్ యూజర్లకు 15 డాలర్లు చెల్లించనున్న యాపిల్
- ఐవోఎస్ 9 అప్ డేట్ తర్వాత నెమ్మదించిన పనితీరు
- దీంతో యాపిల్ కు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు
- కంపెనీ తమను తప్పుదోవ పట్టించిందని ఆరోపణ
- పరిహారానికి ముందుకు వచ్చిన యాపిల్
ఎన్నో ఏళ్ల నాటి న్యాయ వివాదంలో యాపిల్ సంస్థ మెట్టు దిగొచ్చింది. యాపిల్ ఐఫోన్ 4ఎస్ యూజర్లు ఒక్కొక్కరికి 15 డాలర్లు (రూ.1,125) చెల్లించేందుకు అంగీకరించింది. 2015 డిసెంబర్ లో కొందరు ఐఫోన్ 4ఎస్ యూజర్లు న్యూయార్క్, న్యూజెర్సీ కోర్టుల్లో యాపిల్ కు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేశారు.
తమ ఐఫోన్ 4ఎస్ లో ఐవోఎస్ 9 అప్ డేట్ చేసుకున్న తర్వాత పనితీరు గణనీయంగా నిదానించినట్టు వారు ఆరోపించారు. యాపిల్ 4ఎస్ కు ఐవోఎస్ 9 కంపాటిబిలిటీని తప్పుగా పేర్కొన్నట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ‘కొత్త ఐవోఎస్ 9 ఎంతో వేగవంతమైనది, ప్రతిస్పందించేది’అంటూ నాడు యాపిల్ ఇచ్చిన ప్రకటనలను ప్రస్తావించారు. ఇది చూసి ఐవోఎస్ 9ను అప్ డేట్ చేసుకున్న తర్వాత పనితీరు దారుణంగా పడిపోయినట్టు ఆరోపించారు.
ఆరేళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న ఈ కేసును పరిష్కరించుకునేందుకు యాపిల్ ముందుకు వచ్చింది. ఒక్కో యూజర్ 15 డాలర్లు చెల్లిస్తామని పేర్కొంది. 15 డాలర్ల పరిహారాన్ని అందుకునేందుకు అర్హత కలిగిన యూజర్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తాము ఐవోఎస్ 9, ఆ తర్వాత ఏదైనా వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్ పనితీరు నెమ్మదించినట్టు ఒక ధ్రువీకరణ ఇవ్వాలని కోరింది.