Google CEO: చెన్నైలో ఏ స్కూల్లో చదివానో చెప్పిన గూగుల్ సీఈవో పిచాయ్

Google CEO Sundar Pichai reveals the name of school he went to in Chennai

  • వనవాణి స్కూల్లో ఇంటర్ వరకు విద్యాభ్యాసం
  • తర్వాత ఐఐటీ ఖరగ్ పూర్ లో మెటలర్జికల్ ఇంజనీరింగ్
  • అక్కడి నుంచి అమెరికాకు పయనం
  • గూగుల్ లో కొలువు సంపాదించి సత్తా చాటిన పిచాయ్

చెన్నైలో పుట్టి, ఉన్నత విద్యార్హతలతో అమెరికా గడ్డపై అడుగుపెట్టి.. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సారథిగా మారిన సుందర్ పిచాయ్ యువతకు ఓ మార్గదర్శి. విదేశాల్లో భారత ప్రతిభను చాటి చెప్పాలనుకునే ఔత్సాహిక ఇంజనీరింగ్, టెక్నాలజీ నిపుణులకు ఆయన స్ఫూర్తి ప్రదాత. అటువంటి సుందర్ పిచాయ్ చెన్నైలో ఎక్కడ చదివారు? అన్న ఆసక్తి ఎంతో మందిలో ఉంటుంది. 

పిచాయ్ ప్రపంచం మెచ్చే వ్యక్తి కావడంతో చెన్నైలోని పలు పాఠశాలలు ఆయన తమ స్కూల్లోనే చదివాడంటూ ప్రకటనలు ఇచ్చుకున్నాయి. అంతెందుకు వికీపీడియాలో పిచాయ్ పేజీ చూసినా.. గూగుల్ సీఈవో అయిన వారంలో ఆయన పాఠశాల విద్యకు సంబంధించి 350 సార్లు సమాచారం ఎడిటింగ్ కు గురైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పిచాయ్ తన పాఠశాల విద్య ఎక్కడ చేశారన్న ప్రశ్న ఎదుర్కొన్నారు. వికీపీడియా పేజీలో తాను చదివినట్టు ఉన్న ఎన్నో పాఠశాలల్లో రెండు మాత్రమే సరైనవని ఆయన వెల్లడించారు. చెన్నైలోని వనవాణిలో చదివానని, అది ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఆవరణలో ఉంటుందని చెప్పారు.  

తాను హోమ్ స్కూల్ చదివినట్టు వచ్చే వదంతి నిజం కాదని పిచాయ్ స్పష్టం చేశారు. పిచాయ్ ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ పెన్సిల్వేనియాలో ఎంబీఏ చదివారు. 2004లో గూగుల్ లో చేరిన ఆయన తన ప్రతిభతో 2015లో సంస్థ సీఈవో పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగారు. 2019లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవోగానూ పగ్గాలు చేపట్టారు.

  • Loading...

More Telugu News