Mohan Juneja: 'కేజీఎఫ్' నటుడు మోహన్ జునేజా మృతి
- చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మోహన్ జునేజా
- 100కు పైగా చిత్రాల్లో నటించిన మోహన్
- దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా నటించిన ఘనత
ప్రముఖ కన్నడ నటుడు మోహన్ జునేజా ఈ ఉదయం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఆయన కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించారు. 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఆయన జన్మించారు. ఆయన వయసు 54 సంవత్సరాలు.
సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. 'చెల్లాట' అనే సినిమా ఆయనకు మంచి బ్రేక్ నిచ్చింది. కన్నడ సినీ పరిశ్రమ పేరు ప్రఖ్యాతులను నలువైపులా చాటిన 'కేజీఎఫ్', 'కేజీఎఫ్2' చిత్రాల్లో కూడా ఆయన నటించారు. మోహన్ మరణవార్తతో శాండల్ వుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.