Ben Stokes: పునరాగమనం అదిరింది... ఒకే ఓవర్లో 34 పరుగులు సాధించిన బెన్ స్టోక్స్

Ben Stokes smashes 34 runs in a single over

  • ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు సారథిగా స్టోక్స్ నియామకం
  • సుదీర్ఘ విరామం తర్వాత కౌంటీల్లో ఆడుతున్న స్టోక్స్
  • డుర్హమ్ జట్టుకు ప్రాతినిధ్యం
  • 64 బంతుల్లోనే సెంచరీ చేసిన స్టోక్స్

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా నియమితుడైన బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో విశ్వరూపం ప్రదర్శించాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో దిగిన స్టోక్స్ ఒకే ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్ వేసిన ఓ ఓవర్లో స్టోక్స్ వరుసగా ఐదు సిక్స్ లు, ఫోర్ బాదడం విశేషం. కౌంటీల్లో డుర్హామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 ఏళ్ల స్టోక్స్ కేవలం 64 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. స్టోక్స్ బాదుడుకు ఇంగ్లండ్ జట్టు సహచరులు ముగ్ధులయ్యారు. బెన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కాగా, స్టోక్స్ వీరబాదుడుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పంచుకుంది. 

ఇటీవల జో రూట్ ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం తెలిసిందే. యాషెస్ లో ఘోర పరాజయంతో పాటు, బలహీనమైన విండీస్ చేతిలోనూ ఓడిపోవడంతో నైతిక బాధ్యతగా రూట్ వైదొలిగాడు. దాంతో రూట్ వారసుడిగా ఇంగ్లీష్ సెలెక్టర్లు బెన్ స్టోక్స్ ను ఎంపిక చేశారు. 

ఇంగ్లండ్ త్వరలోనే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో సొంతగడ్డపై ఆడాల్సి ఉంది. గతంలో టీమిండియాతో నిలిచిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేయగా, ఇప్పుడా టెస్టును కూడా ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లు స్టోక్స్ నాయకత్వ సామర్థ్యానికి పరీక్ష పెడతాయనడంలో సందేహంలేదు.

Ben Stokes
Durham
County Cricket
England
  • Loading...

More Telugu News