Junmoni Rabha: మోసగాడని తెలియడంతో కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన పోలీసు అధికారిణి
- అసోంలోని నాగావ్ లో ఘటన
- రాణా పోగాగ్ తో మహిళా ఎస్సైకి నిశ్చితార్థం
- ఈ ఏడాది నవంబరులో జరగాల్సిన పెళ్లి
- ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన పోగాగ్
అసోంలో ఓ మహిళా పోలీసు అధికారి వ్యక్తిగత అనుబంధాల కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఘటన వెల్లడైంది. ఆ పోలీసు అధికారిణి తన కాబోయే భర్త మోసగాడని తెలియడంతో ఏమాత్రం వెనుకంజ వేయకుండా అతడ్ని అరెస్ట్ చేసింది.
జున్మోనీ రభా అసోంలోని నాగావ్ లో ఆమె పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు గత అక్టోబరులో రాణా పోగాగ్ తో నిశ్చితార్థం జరిగింది. వారి పెళ్లి ఈ ఏడాది నవంబరులో జరగాల్సి ఉంది. కాగా, రాణా పోగాగ్ తనను తాను ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా ఆ మహిళా ఎస్సైకి పరిచయం చేసుకున్నాడు. అయితే, అతడు ఓ ఘరానా మోసగాడని తర్వాత తేలింది.
తాను ఓఎన్జీసీలో పనిచేస్తున్నానని, తనకు డబ్బులు ముట్టచెబితే ఓఎన్జీసీలో ఉద్యోగాలు కల్పిస్తానని పలువురి నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. ఈ విధంగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయం వెల్లడైంది.
బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్సై జున్మోనీ రభా... కాబోయే భర్త రాణా పోగాగ్ ను అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా బాధితులకు ఆమె వేనోళ్ల కృతజ్ఞతలు తెలిపారు. వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడారని కొనియాడారు. రాణా పోగాగ్ ఎంత మోసగాడో అర్థమైందని వెల్లడించారు.