Delhi Capitals: శివాలెత్తిన డేవిడ్ వార్నర్.. హైదరాబాద్ టార్గెట్ 208 పరుగులు
- 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసిన ఢిల్లీ
- ఉమ్రాన్ మాలిక్‌ను చీల్చిచెండాడిన ఢిల్లీ బ్యాటర్లు
- హాప్ సెంచరీతో రాణించిన రోమన్ పాలెవ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో భాగంగా గురువారం నాడు జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. డిల్లీ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (92) ఏకంగా సెంచరీ దరిదాపుల్లోకి చేరిపోయాడు. మొత్తం 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లను కోల్పోయిన ఢిల్లీ 207 పరుగులు చేసింది. హైదరాబాద్ సన్ రైజర్స్‌కు 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు...ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మన్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లో ఐదు బంతులను ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాట్‌ను ఝుళిపించిన వార్నర్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 92 పరుగులు సాధించాడు. సెంచరీకి చేరువైన వార్నర్ చివరి బంతి దాకా క్రీజులోనే నిలిచాడు. ఇక వరుసగా సత్తా చాటుతున్న రోమన్ పావెల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 67 పరుగులు సాధించాడు. ఫలితంగా ఢిల్లీ 207 పరుగులు చేసింది.
ఇక ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇటీవలి మ్యాచ్‌లో సత్తా చాటుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న హైదరబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన మాలిక్ ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. తన స్పెల్‌లో మాలిక్ ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భువనేశ్వర్‌కుమార్, సీన్ అబాట్, శ్రేయాస్ గోపాల్‌లు తలో వికెట్ తీశారు. 208 పరుగుల లక్ష్యంతో మరికాసేపట్లో హైదరాబాద్ తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది.