Arjun Tendulker: సచిన్ తనయుడు ఈసారైనా ఐపీఎల్ ఆడేనా?... ముంబయి ఇండియన్స్ కోచ్ ఏమన్నాడో చూడండి!
- గత సీజన్ లోనూ అవకాశం దక్కించుకోని అర్జున్
- ఈసారి రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబయి
- ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లోనూ బరిలో దిగని వైనం
- ఆచితూచి స్పందించిన మహేల జయవర్ధనే
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రానికి ఇంకా సమయం పట్టేట్టుంది. గత సీజన్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఎంపికైన అర్జున్ టెండూల్కర్ ను, ఈసారి కూడా అదే జట్టు రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ ఆడేందుకు అర్జున్ ఎప్పటినుంచో తహతహలాడుతున్నాడు. అతడికి ఈ సీజన్ లోనైనా అవకాశం వస్తుందా అనేది సందేహంగా మారింది.
ఎందుకంటే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబయి ఇండియన్స్... తాజా సీజన్ లో దారుణమైన ఆటతీరు కనబరుస్తోంది. వరుసగా 8 మ్యాచ్ లలో ఓడిపోయిన అనంతరం ఎట్టకేలకు ఓ విజయం నమోదు చేసి ఊరట పొందింది. ఈ దశలో జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటివ్వడం కష్టమేననిపిస్తోంది. ఈ నేపథ్యంలో, అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ విషయంలో ముంబయి ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే స్పందించాడు.
జట్టులోని ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని భావిస్తున్నామని మహేల వెల్లడించాడు. తమ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడిని ఓ ప్రత్యామ్నాయంగానే భావిస్తామని, అవకాశాలు రావని ఎవరూ భావించరాదని స్పష్టం చేశాడు. అయితే ఇదంతా ఆటగాళ్ల కాంబినేషన్లు, జట్టు ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుందని, సరైన ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం తమ ప్రాధాన్యతాంశమని మహేల వెల్లడించాడు.
తమకు ప్రతి మ్యాచ్ ముఖ్యమేనని, ఎట్టకేలకు టోర్నీలో తొలి విజయం సాధించామని చెప్పాడు. ఇదే వరుసలో అనేక విజయాలు సాధించి ఆత్మవిశ్వాసాన్ని పుంజుకోవాలని భావిస్తున్నామని వివరించాడు. అత్యుత్తమ ఆటగాళ్లను బరిలో దింపడమే ఇక్కడ కీలకమని ఈ శ్రీలంక దిగ్గజం అభిప్రాయపడ్డాడు. ఎంతో అవసరం అనదగ్గ ఆటగాళ్లలో అర్జున్ కూడా ఉంటే అతడిని కూడా తుది జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఇదంతా జట్టులోని వివిధ కాంబినేషన్లపై ఆధారపడి ఉంటుందని అన్నాడు.
మహేల మాట్లాడిన తీరు చూస్తుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో సచిన్ తనయుడ్ని జట్టులోకి తీసుకోవడం ఎంత క్లిష్టమైన వ్యవహారమో అర్థమవుతుంది. ఏదేమైనా సచిన్ వారసుడి అంశం కాబట్టి మహేల ఎంతో ఆచితూచి స్పందించినట్టు కూడా తెలుస్తోంది.