Jignesh Mewani: జిగ్నేశ్ మేవానీకి 3 నెలల జైలు... 2017 నాటి కేసులో శిక్ష ఖరారు
- 2017లో ఆజాదీ కూచ్ పేరిట జిగ్నేశ్ ర్యాలీ
- ర్యాలీపై నాడే కేసులు నమోదు చేసిన పోలీసులు
- జిగ్నేశ్‌కు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధింపు
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అసోం పోలీసుల కేసులో అరెస్ట్ అయిన మేవానీ ఎలాగోలా ఆ కేసులో బెయిల్‌తో విడుదలయ్యారు. తాజాగా జిగ్నేశ్‌కు 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ గుజరాత్‌లోని ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. 2017లో నమోదైన ఈ కేసు విచారణను ముగించిన కోర్టు... జిగ్నేష్ సహా ఆయన 12 మంది అనుచరులకూ ఈ శిక్షలే ఖరారు చేసింది.
ఆజాదీ కూచ్ పేరిట 2017లో తన అనుచరులతో కలిసి జిగ్నేశ్ ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గుజరాత్‌లోని మెహసానా నుంచి బనస్కంత జిల్లాలోని ధనేరా వరకు సాగింది. ఈ ఘటనపై అప్పుడే పోలీసులు కేసులు నమోదు చేయగా... తాజాగా ఈ కేసులో జిగ్నేశ్‌కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు విచారణను ముగించింది.