Madhya Pradesh: రైతు లీజుకు తీసుకున్న భూమిలో వజ్రం.. రూ. 50 లక్షల ధర పలికే అవకాశం!

Madhya Pradesh Farmer As He Mines Almost 12 Carat Diamond
  • వజ్రాలకు మధ్యప్రదేశ్‌లోని పన్నా ప్రసిద్ధి
  • భూమిని లీజుకు తీసుకుని మూడు నెలలుగా తవ్వుతున్న రైతు
  • 11.88 కేరెట్ల బరువున్న వజ్రం లభ్యం
  • ప్రభుత్వానికి అప్పగింత
  • వేలం వేసి పన్నులు మినహాయించుకుని మిగతా సొమ్ము ఇవ్వనున్న ప్రభుత్వం
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. ఓ పేద రైతు లీజుకు తీసుకున్న భూమిలో అత్యంత నాణ్యమైన వజ్రం లభించింది. త్వరలో జరగబోయే వేలంలో ఈ వజ్రానికి కనీసం రూ. 50 లక్షల ధర పలికే అవకాశం ఉందని చెబుతున్నారు. వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జరిగిందీ ఘటన. 

ప్రతాప్ సింగ్ అనే రైతు ఓ భూమిని లీజుకు తీసుకుని మూడు నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడికి 11.88 కేరెట్ల బరువున్న వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ తెలిపారు. ఈ వజ్రం ఎంతో నాణ్యంగా ఉందని అన్నారు.

మూడు నెలల కష్టానికి ప్రతిఫలం దక్కిన రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు దొరికిన వజ్రాన్ని డైమండ్ కార్యాలయంలో అప్పగించానని, వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని పేర్కొన్నాడు. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో రాయల్టీ, పన్నులు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు అందజేస్తుంది.
Madhya Pradesh
Farmer
Diamond
Panna

More Telugu News