- ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు
- ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ 105 డాలర్లు
- తక్కువ ధరకే సరఫరా చేస్తామంటూ లోగడ రష్యా ఆఫర్
ముడి చమురును మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే కొనుగోలు చేసే విషయమై రష్యాతో భారత్ చర్చలు నిర్వహిస్తోంది. 70 డాలర్లకు లోపే బ్యారెల్ ముడి చమురును భారత్ కు డెలివరీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు నడుస్తున్నట్టు తెలిపాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 105 డాలర్ల వద్ద ఉంది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలు పెట్టిన తర్వాత నుంచి.. రెండు నెలల్లోనే భారత్ 40 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. 2021లో రష్యా నుంచి భారత్ చేసుకున్న మొత్తం చమురు దిగుమతుల కంటే 20 శాతం ఎక్కువ. మన దేశ అవసరాల్లో 85 శాతం మేర దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియా, ఇరాక్ పెద్ద మొత్తంలో భారత్ కు ముడి చమురు ఎగుమతి చేస్తున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఐరోపా దేశాలు.. రష్యా నుంచి ఇంధన దిగుమతులను తగ్గించుకుంటున్నాయి. ఇది రష్యాపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయిస్తామంటూ రష్యా లోగడ భారత్ కు ఆఫర్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలుకు దూరంగా ఉండాలని అమెరికా సైతం భారత్ కు సూచించింది. దీంతో దేశ ప్రయోజనాలకే తమ మొదటి ప్రాధాన్యం అని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.