Coronavirus: గాలిలో కరోనా వైరస్ కణాలు.. సీఎస్ఐఆర్, సీసీఎంబీ పరిశోధనలో గుర్తింపు

Coronavirus particles found in air can spread infection confirms study

  • హైదరాబాద్, మొహాలీలో నమూనాల సేకరణ
  • కరోనా బాధితులున్న ప్రాంతాల్లో గాలిలో వైరస్ విహారం
  • వెంటిలేషన్ లేకపోతే ఇబ్బందే
  • వెలుగులోకి తాజా అధ్యయన ఫలితాలు 

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నది ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. నోటి తుంపర్ల నుంచి వచ్చిన వైరస్ ఏదైనా ఉపరితలం, వస్తువులపైకి చేరి, అక్కడి నుంచి మనుషులకు వ్యాపించొచ్చని తెలుసుకున్నాం. 

కానీ, గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తాజాగా తెలుసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సీఎస్ఐఆర్-సీసీఎంబీ, చండీగఢ్ కు చెందిన సీఎస్ఐఆర్-ఐఎంటెక్, హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల సహకారంతో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం వివరాలు ఎయిరోసాల్ సైన్స్ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

నిజానికి కరోనా వైరస్ ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందన్న దానికి ఇతమిద్దమైన ఆధారాల్లేవు. ఉపరితలం, నీటి తుంపర్ల రూపంలో వైరస్ ఉన్న వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపిస్తున్నట్టు గత పరిశోధనల్లో గుర్తించారు. కానీ, కరోనా వైరస్ సూక్ష్మ కణాల రూపంలో గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న దానికి లోగడ ఆధారాలు లభించలేదు. కానీ, తాజా అధ్యయనం గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించింది. హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల (కరోనా బాధితులున్న) ప్రాంతాల నుంచి గాలి నమూనాలను సేకరించి, జీనోమ్ కంటెంట్ ను పరీక్షించారు. 

ఆయా ప్రాంతాల్లోని గాలిలో కరోనా వైరస్ బయటపడింది. కరోనా బాధితులు ఉన్న ఆసుపత్రుల్లోని ఐసీయూ, నాన్ ఐసీయూ ప్రాంతాల్లోని గాలిలోనూ కరోనా వైరస్ కణాలను గుర్తించారు. రోగులు విడిచిన వైరస్ ఇదని వారు పేర్కొన్నారు. తగినంత వెంటిలేషన్ లేకపోతే గాలిలో కరోనా వైరస్ నిలిచి ఉంటుందని తమ అధ్యయనం ఫలితాలు చెబుతున్నట్టు సైంటిస్ట్ శివరంజని మనోహన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News