C Kalyan: సినీ కార్మికోత్సవం నాడు దాసరి నారాయణరావు ప్రస్తావనే లేకపోవడం బాధాకరం. నిర్మాత సి.కల్యాణ్
- మే డే సందర్భంగా సినీ కార్మికోత్సవం
- హాజరైన తెలంగాణ మంత్రులు, చిరంజీవి
- దాసరిని విస్మరించారన్న సి.కల్యాణ్
- తప్పు జరిగిందన్న ఫిలిం ఫెడరేషన్
మే డే నాడు హైదరాబాదులో తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో దివంగత దర్శకుడు దాసరి నారాయణ గురించి కనీస ప్రస్తావన లేకపోవడం అత్యంత బాధాకరమని నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. దాసరి నారాయణరావు లేకుండా సినీ కార్మికులు లేరని కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సినీ కార్మికులు దాసరి నారాయణరావును, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డిలను మర్చిపోవడం సరికాదని అన్నారు.
సి.కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ వివరణ ఇచ్చారు. సినీ కార్మికోత్సవంలో దాసరి నారాయణరావు ఫొటో ఏర్పాటు చేశామని, కానీ దండ వేయడం మర్చిపోయామని చెప్పారు. తాము చేసింది తప్పేనని అనిల్ అంగీకరించారు. ఇకపై తాము ఏ కార్యక్రమం చేపట్టినా దాసరికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
మే డే సందర్భంగా నిర్వహించిన సినీ కార్మికోత్సవంలో మంత్రి తలసాని మాట్లాడుతూ, ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవేనని అన్నారు. అటు, 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు సైతం చిరంజీవిని పరిశ్రమ పెద్దగా ప్రకటించారు.