Rape: విజయనగరం అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ వివరణ
- స్నేహితుడితో కలిసి ఉన్న సందర్భంగానే యువతిపై అత్యాచారం
- బాధితురాలి ఇంటికి వచ్చిన ఇద్దరిలో ఒక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు
- యువతి ఫిర్యాదు మేరకు ప్రమేయం ఉన్నవారందరిపైనా కేసు పెడతామన్న ఎస్పీ
విజయనగరంలో జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేశామని చెప్పిన ఎస్పీ... ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని కూడా తెలిపారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపైనా ఎస్పీ వివరాలు వెల్లడించారు.
నగరంలోని ఉడా కాలనీకి చెందిన ఓ మహిళ తన స్నేహితుడితో కలిసి ఇంటిలో ఉండగా ఈ దారుణం చోటుచేసుకుందన్నారు. బాధితురాలి ఇంటికి ఇద్దరు యువకులు వచ్చారని, వారిలో ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. నిందితుడు విజయనగరానికి చెందినవాడిగానే గుర్తించామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అందరిపైనా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పిన ఎస్పీ.. విచారణ ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.