Twitter: ట్విట్టర్ టాప్ ఉద్యోగుల తొలగింపునకు మస్క్ ప్రణాళిక!

Elon Musk plans to replace Twitter CEO Parag Agrawal and fire Vijaya Gadde

  • సీఈవోగా పరాగ్ అగర్వాల్ స్థానంలో కొత్త వ్యక్తి
  • లీగల్ హెడ్ విజయ సైతం తొలగింపు అవకాశం
  • ట్విట్టర్ బోర్డులో తన వారికి చోటు ఇవ్వనున్న మస్క్

44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్ కొనుగోలుకు డీల్ చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ లో టాప్ ఉద్యోగులను మార్చడంతోపాటు, సిబ్బందికి కోత పెట్టే ప్రణాళికతో ఆయన ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ట్విట్టర్ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. ఆయనని తొలగించి తనకు నచ్చిన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టాలన్నది మస్క్ ఆలోచన. ఇందుకు తగిన వ్యక్తిని కూడా ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ట్విట్టర్ ప్రస్తుత యాజమాన్యంపై తనకు విశ్వాసం లేదని స్వయంగా ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించారు. కనుక మార్పులు తథ్యమని తెలుస్తోంది. పరాగ్ అగర్వాల్ భారత్ లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత పదవిని అధిరోహించారు. గతేడాది నవంబర్ లో ట్విట్టర్ వ్యవస్థాపకుడు, సీఈవోగా ఉన్న జాక్ డార్సే తాను ఆ బాధ్యతల నుంచి తప్పుకుని అగర్వాల్ కు అప్పగించారు. అగర్వాల్ ను తొలగిస్తే అతడికి మస్క్ 43 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా.

ఇక ట్విట్టర్ లీగల్ హెడ్ గా ఉన్న భారత సంతతి వ్యక్తి విజయ గడ్డేను కూడా ఎలాన్ మస్క్ తప్పించొచ్చని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. అదే జరిగితే ఆమెకు 12.5 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుతం ఆమె వార్షిక ప్యాకేజీ 17 మిలియన్ డాలర్లుగా ఉంది. ట్విట్టర్ సిబ్బందిని తగ్గిస్తానని, ట్వీట్లను సొమ్ము చేసుకుంటానంటూ ఎలాన్ మస్క్ బ్యాంకులకు హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సిబ్బందికి సైతం కోత పడుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News