Elon Musk: వాటాలను ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి?... ఎలాన్ మస్క్ సలహా ఇదిగో!

What Elon Musk said to raise wealth

  • ఇటీవల ట్విట్టర్ ను కొనేసిన ఎలాన్ మస్క్
  • రూ.3 లక్షల కోట్లతో భారీ డీల్
  • సంపద పెంచుకోవడంపై మస్క్ వివరణ
  • ట్విట్టర్ లో స్పందించిన వ్యాపార దిగ్గజం 

టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జోరు చూస్తుంటే ఈ భూమండలంపై దేన్నైనా కొనేయగలరనిపిస్తోంది. ఇటీవల రూ.3 లక్షల కోట్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఆయన వ్యాపార సామర్థ్యం ఏంటో యావత్ ప్రపంచానికి స్పష్టమైంది. ఈ నేపథ్యంలో, ఎలాన్ మస్క్ వ్యాపారానికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. 

సంపద ఎలా పెంచుకోవాలన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. అందులో భాగంగా, వాటాలను ఎప్పుడు అమ్మాలి? ఎప్పుడు కొనాలి? అన్నదానిపై వివరణ ఇచ్చారు. "ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. మార్కెట్ కుదుపులకు లోనైనప్పుడు మీరు కూడా దాంతోపాటే భయాందోళనలకు గురికావొద్దు. మీరు బాగా నమ్మే వస్తు ఉత్పాదన కంపెనీల షేర్లు, మీరు విశ్వసించదగిన సేవలు అందించే వివిధ కంపెనీల షేర్లను కొనుగోలు చేయండి. ఆయా కంపెనీల షేర్లు అత్యంత పతనావస్థలో ట్రేడ్ అవుతున్నాయని భావించినప్పుడే వాటిని విక్రయించండి. దీర్ఘకాలంలో ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుంది" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 

ఎలాన్ మస్క్ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా నివేదిక ప్రకారం 268.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా ఉన్నారు. ఇటీవలే ఆయన 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాపార రంగంలో సంచలనం సృష్టించింది. ట్విట్టర్ ను చేజిక్కించుకునే క్రమంలో తన వ్యక్తిగత ఆస్తి నుంచి ఆయన 21 బిలియన్ డాలర్లను వెచ్చించినట్టు తెలుస్తోంది.

More Telugu News