Nara Lokesh: హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి ఇలా మాట్లాడటం దురదృష్టకరం: లోకేశ్
- మహిళల తప్పిదాలవల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడారన్న లోకేశ్
- ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్.. పూటకో రేప్ అని విమర్శ
- బీహార్ ను ఆంధ్రప్రదేశ్ మించిపోయింది అని ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటనపై ఆయన స్పందించారు.
''ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్... పూటకో రేప్. బీహార్ ను మించిపోయింది ఆంధ్రప్రదేశ్. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వెంకటాద్రిపురం నుంచి బతుకుదెరువు కోసం భర్త, పిల్లలతో వలసవెళ్లిన మహిళపై రేపల్లె రైల్వే స్టేషన్ లో కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.
రాష్ట్రంలో ఏం చేసినా పోలీసులు ఏమీ చేయలేరనే ధైర్యంతోనే ఉన్మాదులు ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. హోం మంత్రి తానేటి వనిత ఒక మహిళ అయి ఉండి మహిళల తప్పిదాలవల్లే రేప్ లు జరుగుతున్నాయనే విధంగా మాట్లాడటం దురదృష్టకరం. అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి'' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.