health: పుచ్చకాయలోని నల్ల విత్తనాలు పడేయకండి.. వాటితో ఆరోగ్యం
- వీటిల్లో ఎన్నో విలువైన పోషకాలు
- వ్యాధి నిరోధక శక్తికి మేలు
- గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
- ఎముకల పటుత్వానికి సాయం
- వేయించుకుని రోజూ కొద్ది మొత్తం తీసుకోవచ్చు
వేసవిలో పుచ్చకాయ (వాటర్ మెలాన్) లను ఎక్కువ మంది తినడం సర్వ సాధారణం. తక్కువ రేటులో ఎక్కువ మంది కడుపు నింపే పండు ఇది. పుచ్చకాయను కోసి తినే సమయంలో నల్ల విత్తనాలు వస్తే వాటిని ఎక్కువ మంది ఊసేస్తుంటారు. కోసే సమయంలోనే విత్తనాలను పారేసి తినే వారు కూడా ఉంటారు. కానీ, పుచ్చ విత్తనాలను పడేయడం వల్ల నష్టమే కానీ లాభం లేదు.
బలమైన వ్యాధి నిరోధక శక్తికి, చక్కని ఆరోగ్యానికి పుచ్చ విత్తనాలు మేలు చేస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిత్యం కొన్ని విత్తనాలు తీసుకోవాలి. మంచిది కదా అని మరీ ఎక్కువ తీసుకోకూడదు.
పుచ్చ విత్తనాల్లో కాపర్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల, వీటితోపాటు ఇతర సూక్ష్మ పోషకాల సాయంతో మన ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల సాంద్రతను కూడా పెంచుతుంది.
పుచ్చకాయ విత్తనాల్లోని ఫోలేట్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా విలువైన పోషకాలు. వీటిల్లో అమైనో యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలసి జీవక్రియలకు సాయపడతాయి. ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ అయిన.. ఒలిక్ యాసిడ్, లినోలియం యాసిడ్ ఇందులో ఉన్నాయి.
మధుమేహం నియంత్రణకు సైతం పుచ్చవిత్తనాలు సాయపడతాయి. రక్తంలో పెరిగిన గ్లూకోజ్ ను తగ్గిస్తుంది.
పుచ్చకాయ విత్తనాల నుంచి తీసిన నూనెను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతుంది. ముడతలు పడడాన్ని ఆపుతుంది. పెనంలో పుచ్చవిత్తనాలను వేయించి గాలి చొరబడని డబ్బాలో పోసుకోవాలి. దీన్ని రోజూ స్నాక్ గా కొద్ది మొత్తంలో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు.