UAE: రష్యా కుబేరులకు, వారి ఆస్తులకు భరోసా ఇస్తున్న యూఏఈ యువరాజు!
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
- రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు
- రష్యన్ సంపన్నుల ఆస్తుల స్తంభన
- రష్యన్ ధనికులకు ఆహ్వానం పలుకుతున్న యూఏఈ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజకుటుంబంలో షేక్ మన్సౌర్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఓ కీలక వ్యక్తి. యూఏఈ పాలకవర్గంలో ఆయన ఉప ప్రధాని అయినా, ప్రధాన వ్యవహారాల్లో చక్రం తిప్పేది అతడే. అంతేకాదు, షేక్ మన్సౌర్ క్రీడాభిమాని. ఆయన ప్రఖ్యాత మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్ క్లబ్ కు యజమాని కూడా. అసలు విషయం ఏంటంటే... ఇప్పుడీ యూఏఈ రాజకుటుంబీకుడు రష్యా సంపన్న వర్గాలకు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు.
ఇటీవల ఉక్రెయిన్ పై రష్యా దండెత్తిన నేపథ్యంలో, ప్రపంచ దేశాలు రష్యన్ల ఆస్తులపైనా, వ్యాపారాలపైనా తీవ్ర ఆంక్షలు విధించాయి. తమ భూభాగంపై ఉన్న రష్యా కుబేరుల ఆస్తులను అనేక దేశాలు స్తంభింపజేశాయి. దాంతో, అనేక మంది రష్యా ధనికులు తమ ఆస్తులను ఇప్పుడు యూఏఈ కి తరలిస్తున్నారు. ఈ మేరకు వారికి షేక్ మన్సౌర్ నుంచి భరోసా లభించినట్టు తెలుస్తోంది.
యూఏఈలో రష్యా కుబేరుల కార్యకలాపాలకు ఇప్పుడు షేక్ మన్సౌర్ కార్యాలయం కేంద్రంగా నిలుస్తోంది. రష్యా నుంచి వస్తున్న ధనిక వర్గాలకు షేక్ మన్సౌర్ కార్యాలయ సిబ్బంది అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారు. యూఏఈలో బ్యాంకు ఖాతాలు తెరవడం దగ్గర్నుంచి, ఆస్తుల కొనుగోలు వరకు షేక్ మన్సౌర్ కార్యాలయం రష్యా సంపన్నులకు పూర్తి సహకారం అందిస్తోంది. సంపన్నులతో పాటే రష్యా నుంచి భారీగా పెట్టుబడులు కూడా వస్తుండడంతో యూఏఈ ప్రభుత్వం కూడా సానుకూల ధోరణిలో వ్యవహరిస్తోంది.
రష్యాకి యూఏఈ చాలాకాలంగా మిత్రదేశంగా ఉంది. అందుకు షేక్ మన్సౌర్ వారధిగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగగానే అమెరికా, బ్రిటన్, ఈయూ దేశాలు ఆంక్షలు ప్రకటించినా, యూఏఈ మాత్రం మిత్రదేశంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇప్పుడు రష్యన్ కుబేరులకు ఆశ్రయం ఇస్తున్న నేపథ్యంలో... రష్యా, యూఏఈల మైత్రి మరింత బలపడనుంది.