Andhra Pradesh: ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేశ్, దాడిశెట్టి రాజాల పీఏ, పీఎస్‌ల రీకాల్
- ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత సిబ్బందిగా ఉపాధ్యాయులు ఉండరాదు
- ఈ మేరకు ఇదివరకే కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
- కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 26 మంది ఉపాధ్యాయుల రీకాల్
ఏపీలో కొత్తగా మంత్రిగా పదవి దక్కించుకున్న మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు మంత్రి పదవిని నిలబెట్టుకున్న మంత్రి ఆదిమూలపు సురేశ్‌లకు ఏపీ విద్యా శాఖ షాకిచ్చింది. ఇద్దరు మంత్రుల వద్ద పీఏ, పీఎస్‌లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆ బాధ్యతల నుంచి తప్పించించేసింది. వారిని తిరిగి విద్యాశాఖలోకి రీకాల్ చేసింది. ఈ మేరకు గురువారం నాడు ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజా ప్రతినిధుల వద్ద పీఏలు, పీఎస్‌లుగా ఉపాధ్యాయులు కొనసాగడానికి వీల్లేదంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను గుర్తు చేసుకున్న విద్యా శాఖ ఇద్దరు మంత్రుల వద్ద పనిచేస్తున్న పీఏ, పీఎస్‌లను వెనక్కు పిలిచింది. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేల వద్ద పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా విద్యా శాఖ వెనక్కు పిలిచింది. ఇలా గురువారం నాడు మొత్తం 26 మంది ఉపాధ్యాయులను ప్రజా ప్రతినిధుల వద్ద వ్యక్తిగత సిబ్బంది హోదాల నుంచి రీకాల్ చేసింది.