Chandrababu: నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప పాఠశాలలకు ఏమీ చేయడంలేదు... అందుకు ఇదే నిదర్శనం: చంద్రబాబు
- కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఘటన
- పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలిన వైనం
- చిన్నారులకు తీవ్ర గాయాలు
- సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రాథమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారులకు గాయాలవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పైకప్పు పెచ్చులు ఊడిన ఘటనలో చిన్నారుల తలలకు తీవ్ర గాయాలవడం బాధాకరమని పేర్కొన్నారు. నాడు-నేడు అని ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం పాఠశాలల పునరుద్ధరణ కోసం ఏమీ చేయడంలేదని, అందుకు ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు.
పాఠశాల తరగతి గదుల పరిస్థితిపై తల్లిదండ్రులు హెచ్చరించినా పట్టించుకోలేదంటే ఏమనాలి? అంటూ మండిపడ్డారు. చదువుకుందామని బడికొచ్చిన చిన్నారులు మీ నిర్లక్ష్యం వల్ల, మీ అసమర్థత వల్ల రక్తం చిందించాల్సి వచ్చిందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పాఠశాలల్లో మౌలిక వసతుల పట్ల శ్రద్ధ చూపాలని చంద్రబాబు హితవు పలికారు. దినపత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటనకు ఇచ్చే డబ్బుతో ఎన్నో పనులు చేయవచ్చని పేర్కొన్నారు. బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.