TPCC President: కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ షాకివ్వడంపై రేవంత్ స్పందన ఇదే
- పీకే మా పార్టీలో చేరకపోతేనే మంచిదన్న రేవంత్
- పీకేతో ఎలాంటి గట్టు పంచాయితీ లేదని వెల్లడి
- పార్టీలో చేరిక పీకే వ్యక్తిగత అంశమన్న రేవంత్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈ వ్యవహారంపై కొనసాగుతున్న చర్చకు మంగళవారంతో శుభం కార్డు పడిపోయింది. కాంగ్రెస్‌లో చేరాలన్న అదినేత్రి సోనియా గాంధీ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించిన ప్రశాంత్ కిశోర్..తాను పార్టీలో చేరనని, వ్యూహకర్తగా మాత్రమే కొనసాగుతానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ప్రశాంత్ కిశోర్ కూడా విస్పష్టంగా ప్రకటనలు ఇచ్చేశారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు.
పీకే వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే... "ప్రశాంత్ కిశోర్ ప్రకటనలో మా పార్టీ కార్యకర్తలకు స్పష్టత వచ్చింది. పీకే కాంగ్రెస్‌లో చేరాలా? వద్దా? అన్నది ఆయన వ్యక్తిగత విషయం. పీకే మా పార్టీలో చేరకపోతే మరీ మంచిది. పార్టీలో చేరితే మాత్రం పార్టీ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలని చెప్పాం. వ్యక్తిగతంగా పీకేతో నాకు ఎలాంటి గట్టు పంచాయితీ లేదు. కేసీఆర్‌తో ఎవరు జట్టు కట్టినా వ్యతిరేకిస్తాం" అని రేవంత్ రెడ్డి స్పందించారు.