Tirupati: రుయా ఆసుపత్రి ఘటనపై మంత్రి విడదల రజని స్పందన ఇదే
- దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి
- ప్రైవేట్ ఆంబులెన్స్‌లను నియంత్రిస్తామని హామీ
- త్వరలోనే నిరంతరాయంగా మహాప్రస్థానం అంబులెన్స్ సేవలన్న రజని
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి అంబులెన్స్ డ్రైవర్లు సాగించిన దందాపై ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పందించారు. ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన మంత్రి... దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా మహాప్రస్థానం అంబులెన్స్‌లు నిరంతరం పనిచేసేలా త్వరలోనే ఓ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... "ఘటనపై రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి నుంచి వివరణ కోరాం. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ అంబులెన్స్‌లను నియంత్రిస్తాం. ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దోషులను కఠినంగా శిక్షిస్తాం. మృతుడి కుటుంబ సభ్యులు, మహాప్రస్థానం అంబులెన్స్ డ్రైవర్‌ను ఎవరు బెదిరించారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తాం. ఇకపై మహాప్రస్థానం వాహనాల్లో ఉచితంగానే మృతదేహాలను తరలిస్తాం. మహాప్రస్థానం అంబులెన్స్‌లు నితంతరం పనిచేసేలా త్వరలో విధానం తీసుకొస్తాం" అని మంత్రి పేర్కొన్నారు.