Congress: కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తే ఉండదన్న కేటీఆర్
- ప్రజలు కాంగ్రెస్‌కు 50 ఏళ్ల పాటు అవకాశమిచ్చారని వ్యాఖ్య
- దేశాన్ని కాంగ్రెస్ తిరోగమన బాటలోకి నెట్టేసిందని విమర్శ
- కాంగ్రెస్‌కు భవిష్యత్తే లేదన్న కేటీఆర్
కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, ఆ దిశగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఏకంగా రెండు రోజుల పాటు చర్చలు జరిపారని సాగుతున్న ప్రచారంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగానే ఆయన కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ ఓ అనవసరమైన పార్టీగా అభివర్ణించారు. అలాంటి పార్టీతో తమకు ఎలాంటి పొత్తులు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. 50 ఏళ్ల తరబడి దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇస్తూ పోయారన్న కేటీఆర్...ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పారు.
కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా దేశాన్ని తిరోగమన బాటలోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ను ప్రజలు ప్రయత్నించారు, పరీక్షించారు అంటూ పేర్కొన్న కేటీఆర్.. సదరు పార్టీని దుమ్ము పట్టేసిన పార్టీగా అభివర్ణించారు. ఆఖరికి భవిష్యత్తే లేని పార్టీగా కూడా కాంగ్రెస్‌ను కేటీఆర్ పేర్కొన్నారు.