France: మళ్లీ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కే ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం.. మిత్రుడికి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Frances Macron beats Le Pen to win second term

  • అధ్యక్ష ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓట్లు
  • ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలిపిన మెక్రాన్
  • సవరణలు తీసుకురావాలని అనుకుంటున్నట్టు ప్రకటన

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి మెరైన్ లీపెన్ ను ఆయన ఓడించారు. తన మొదటి విడత పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. పాలనలో మార్పు కోసం ఎన్నో సవరణలు తీసుకురావాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతు దారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

ఆదివారం రాత్రి వరకు 97 శాతం ఓట్లను లెక్కించగా ఇమ్మాన్యుయేల్ కు 57.4 శాతం ఓట్లు లభించాయి. చాలా మంది ప్రజలు లీపెన్ ను అధికారానికి దూరంగా ఉంచాలనే తనకు ఓటు వేసిన వేసినట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘దేశంలో చాలా మంది నాకు ఓటు వేశారు. అంటే నా ఆలోచనలకు వారు మద్దతు పలికినట్టు కాదు. అతివాదులను దూరంగా ఉంచాలనే అలా వ్యవహరించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఫ్రాన్స్ లో ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపించం’’ అంటూ ఇమ్మాన్యుయేల్ ప్రకటన చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి మెక్రాన్ ఎన్నిక కావడం పట్ల భారత ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘నా స్నేహతుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక కావడం పట్ల అభినందనలు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలసి పనిచేయాలని అనుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 


More Telugu News