India: పై చదువుల కోసం ఎవరూ పాకిస్థాన్ వెళ్లొద్దు: కేంద్రం స్పష్టీకరణ
- యూజీసీ, ఏఐసీటీఈ సంయుక్త ప్రకటన
- పాక్ విద్యాసంస్థల్లో పేర్లు నమోదు చేసుకోవద్దని సూచన
- భారత్ లో అవకాశాలు కోల్పోతారని వివరణ
- భారత్ కు వలస వచ్చిన వారికి మినహాయింపు
దేశంలోని విద్యార్థులను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పై చదువుల నిమిత్తం ఎవరూ పాకిస్థాన్ వెళ్లొద్దని స్పష్టం చేసింది. పాకిస్థాన్ లోని విద్యాసంస్థల్లో తమ పేర్లు నమోదు చేసుకోవద్దని యూజీసీ, ఏఐసీటీఈ సంయుక్తంగా పేర్కొన్నాయి. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారు భారత్ లో ఉన్నత విద్యాభ్యాసానికి, ఉద్యోగాలు పొందేందుకు అర్హత కోల్పోతారని హెచ్చరించాయి. పాకిస్థాన్ లో పొందిన విద్యార్హతలు భారత్ లో చెల్లుబాటు కావని స్పష్టం చేశాయి.
అయితే, భారత్ కు వలస వచ్చి ఇక్కడి పౌరసత్వం పొందినవారు, వారి పిల్లలు పాకిస్థాన్ లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుంటే, భారత్ లో ఉద్యోగాలకు అర్హులేనని వెల్లడించాయి. అయితే, అందుకు భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పత్రాలు సమర్పించడం తప్పనిసరి అని యూజీసీ, ఏఐసీటీఈ వివరించాయి