Old Man: నారాయణగూడలో సైబర్ మోసం.... "నిన్నే పెళ్లాడుతా" అంటూ వృద్దుడికి టోకరా!

Girl cheats old man in Hyderabad

  • మ్యాట్రిమొని సైట్ లో వివరాలు నమోదు చేసుకున్న వృద్ధుడు
  • మరుసటి రోజే ఫేస్ బుక్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్
  • ఇంజినీరింగ్ స్టూడెంట్ నంటూ పరిచయం
  • మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానంటూ వృద్ధుడికి ఎర
  • రూ.46 లక్షలు లాగేసిన వైనం

ఆయనొక వృద్ధుడు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటాడు. వయసు 50కి పైమాటే. ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తన వ్యక్తిగత వివరాలను ఓ మ్యాట్రిమొనీ సైట్ లో నమోదు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే అతగాడికి ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అప్పటినుంచి ఇరువురు తరచుగా చాటింగ్ చేసుకునేవారు. 

తాను ఇంజినీరింగ్ చదువుతున్నట్టు ఆ అమ్మాయి తెలిపింది. మీరు 50వ పడిలో ఉన్నా నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా అంటూ ఆ అమ్మాయి సదరు వృద్ధుడ్ని ఉచ్చులోకి లాగింది. ఇంజినీరింగ్ పరీక్ష ఫీజులు కట్టేందుకు డబ్బులు లేవని ఓసారి, కరోనా వచ్చిందని మరోసారి, ఇలా అనేక పర్యాయాలు ఆ వృద్ధుడి నుంచి డబ్బులు రాబట్టింది. 25 ఏళ్ల అమ్మాయి తననే పెళ్లి చేసుకుంటానని చెబుతుండడంతో ఆ వృద్ధుడు మరేమీ ఆలోచించలేదు. ఆమె కోరిన విధంగా డబ్బు పంపించాడు. ఆ మాయలేడి  ఆ విధంగా మొత్తం రూ.46 లక్షలు గుంజేసింది. 

చివరికి తాను మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.

More Telugu News