Nara Lokesh: ఈ రోజు రెవెన్యూ అధికారులపైకి వచ్చిన జేసీబీ రేపు పోలీసులపైకీ రాదన్న గ్యారెంటీ ఉందా?: లోకేశ్
- రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరవింద్ పై దాడి చేశారన్న లోకేశ్
- ఈ దాడి మాజీ మంత్రి కొడాలి నాని పనేనని ఆరోపణలు
- గడ్డంగ్యాంగ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
- ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్న టీడీపీ నేత
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని మట్టి మాఫియా కాల్వల వెంట అక్రమంగా మట్టిని తరలించేందుకు యత్నించడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరవింద్ అక్కడకు వెళ్లగా ఆయనపై దాడి జరిగిందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ దాడి మాజీ మంత్రి కొడాలి నాని పనేనని ఆయన ఆరోపణలు గుప్పించారు.
అరవింద్‌పై జేసీబీతో దాడి చేసిన గడ్డంగ్యాంగ్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొడాలి నాని మంత్రి పదవి పోయిన అనంతరం విశ్వరూపం చూపిస్తానని అన్నారని, ఆయన మాటలకు అర్థం ఇలా రెవెన్యూ అధికారులపై దాడులు చేయడమేనా? అని నారా లోకేశ్ నిలదీశారు.
అదృష్టవశాత్తూ అరవింద్ ప్రాణాలు దక్కాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహంతోనే మట్టి మాఫియాలు, గడ్డం గ్యాంగులు ఇలాంటి దాడులు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
మట్టి మాఫియాతో పాటు, గడ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాలని ఆయన అన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రాణాలు తీసేందుకు యత్నించిన గడ్డం గ్యాంగ్ మట్టిమాఫియా అరాచకాలు పోలీసులకి పట్టవా? అని ఆయన నిలదీశారు. ఈ రోజు రెవెన్యూ అధికారులపైకి వచ్చిన జేసీబీ రేపు పోలీసులపైకీ రాదన్న గ్యారెంటీ ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామని చెబుతూనే, ఇప్పటికే చాలామంది అమాయకులను వైసీపీ నేతలు అంతమొందించారని ఆయన ఆరోపించారు. పోలీసులు, అధికారుల అండతో ప్రజలు, ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతలను వైసీపీ నేతలు టార్చర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.