Nara Lokesh: అవినీతిపై యాప్ వస్తే సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు చేస్తా: నారా లోకేశ్
- దుగ్గిరాల మండలంలో పర్యటించిన లోకేశ్
- మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ప్రకటన
- ఏపీని చూస్తుంటే బీహార్‌ను చూస్తున్నట్టే ఉందని వ్యాఖ్య
మహిళలపై నేరాల అదుపునకు తీసుకొచ్చిన దిశ యాప్ మాదిరే అవినీతి వ్యవహారాలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. సీఎం జగన్ అవినీతిపైనే తాను తొలి ఫిర్యాదు చేస్తానని లోకేశ్ వ్యాఖ్యానించారు.
మంగళగిరి నియోజవర్గంలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో గురువారం పర్యటించిన సందర్భంగా లోకేశ్ పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బీహార్‌ను చూస్తున్నట్లు ఉందని ఆయన అన్నారు. మంగళగిరిలో చరిత్ర తిరగరాస్తామని, టీడీపీ జెండాను ఎగురవేస్తామని ఆయన తెలిపారు. మంగళగిరి పౌరుషం ఏమిటో వైసీపీకి చూపిస్తామని లోకేశ్ అన్నారు.