Jagan: బిర్లా గ్రూప్ ఏపీకి రావడం సంతోషకరం.. పరిశ్రమ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: జగన్
- కాస్టిక్ సోడా యూనిట్ ను ప్రారంభించిన జగన్
- 1,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుందన్న సీఎం
- కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రూ. 2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ ఒప్పుకుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిమ్ పరిశ్రమ నెలకొల్పిన కాస్టిక్ సోడా యూనిట్ ను జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమ వల్ల 1,300 మందికి ప్రత్యక్షంగా 1,150 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుపై గతంలో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద గ్రాసిమ్ ఇచ్చే నిధులను స్థానికంగా ఖర్చు చేస్తామని తెలిపారు.