Vijayashanti: అమాయ‌కుల ప్రాణాలు బలి తీసుకుంటున్న కేసీఆర్ స‌ర్కారుకు ఆ దేవుడే త‌గిన శాస్తి చేస్తాడు: విజయశాంతి

Vijayasanthi warns TRS govt

  • ఖమ్మంలో సాయిగణేశ్ ఆత్మహత్య
  • కామారెడ్డిలో తల్లీకుమారుడు బలవన్మరణం
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విజయశాంతి
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక దోషులను శిక్షిస్తామని వ్యాఖ్య  

తెలంగాణలో నయా నిజాం నిరంకుశ పాలన కొనసాగుతోందంటూ కేసీఆర్ సర్కారుపై బీజేపీ మహిళా నేత విజయశాంతి ధ్వజమెత్తారు. హిట్లర్ పాలన చేస్తున్న కేసీఆర్ బాటలోనే టీఆర్ఎస్ నేతలు కూడా నడుస్తున్నారని, అమాయకులను బెదిరిస్తూ ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఖమ్మంలో సాయిగణేశ్ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లీకుమారుల బలవన్మరణం ఘటనలపై విజయశాంతి తీవ్రస్థాయిలో స్పందించారు. 

టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక ఖమ్మం, కామారెడ్డిలో అమాయకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా... ప్రజల బాధలు తీర్చాల్సిన టీఆర్ఎస్ నేతలు లేని బాధలను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆత్మహత్యల నేపథ్యంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, బాధ్యులైన పోలీసుల పైనా, నేతలపైనా హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందని భయపడ్డారని, అందుకే మరణ వాంగ్మూలం తీసుకోలేదని విజయశాంతి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని వివరించారు. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న కేసీఆర్ సర్కారుకు ఆ దేవుడే తగిన శాస్తి చేస్తాడని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోమని, కచ్చితంగా చట్టప్రకారం శిక్షించి తీరుతామని ఉద్ఘాటించారు.

Vijayashanti
KCR
TRS Govt
BJP
Telangana
  • Loading...

More Telugu News